అగ్నివీరులకు భారత నౌకాదళం కీలక వెసులుబాటు కల్పించింది. తొలి నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత మరో రెండేళ్ల సర్వీసు పొడిగింపు పొందిన వారు వివాహం చేసుకునేందుకు అనుమతించింది. అంతేకాకుండా, పొడిగించిన సర్వీసు సమయంలో పెళ్లి చేసుకుని గర్భం దాల్చిన మహిళా అగ్నివీరులకు పూర్తిస్థాయి ప్రసూతి ప్రయోజనాలు, సెలవులు వర్తిస్తాయని ప్రకటించింది. ఇప్పటివరకు ప్రారంభ నాలుగేళ్ల సర్వీసు కాలంలో అగ్నివీరులకు వివాహంపై నిషేధం ఉండేది. నిబంధనలు ఉల్లంఘిస్తే విధుల నుంచి తొలగించే అవకాశం కూడా ఉండేది.
అయితే రెండేళ్ల సర్వీసు పొడిగింపునకు ఎంపికైన వారు కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ముందుగా ప్రారంభ శిక్షణను పూర్తి చేయాలి. ఇందులో వృత్తిపరమైన శిక్షణతో పాటు వారు ఎంపికైన విభాగానికి సంబంధించిన ప్రత్యేక శిక్షణ కూడా ఉంటుంది. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత వివాహం చేసుకోవడానికి అర్హులైన సెలవులను వినియోగించుకోవచ్చని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
అగ్నిపథ్ పథకం కింద నియమితులైన అగ్నివీరులకు తొలి నాలుగేళ్ల తర్వాత ప్రతిభ ఆధారంగా 25 శాతం మందిని శాశ్వత సర్వీసులోకి తీసుకునే అవకాశం ఉంది. మిగిలిన 75 శాతం మందికి మరో రెండేళ్ల సర్వీసు పొడిగింపు కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో నౌకాదళం తీసుకున్న తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే తరహాలో భారత సైన్యం, వైమానిక దళం కూడా తమ నిబంధనలకు అనుగుణంగా వెసులుబాటు కల్పిస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది.
Post Views: 2








