E-PAPER

‘ఆర్య 2’ సినిమాలో ఆ సీన్ నచ్చలేదు.. అల్లు అర్జున్‌పై నటి అనన్య శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆర్య’ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో దానికి కొనసాగింపుగా ‘ఆర్య 2’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, సంగీతపరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. టీవీల్లో ప్రసారమైన తర్వాత ప్రేక్షకుల నుంచి మరింత ఆదరణ పొందింది. ఇప్పటికీ ఈ సినిమాకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా ఈ చిత్రంలోని ఓ సన్నివేశంపై నటి అనన్య శర్మ అభ్యంతరం వ్యక్తం చేసింది.

‘30 వెడ్స్ 21’ వెబ్‌ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న అనన్య శర్మ ప్రస్తుతం ‘హై’ సినిమాతో కథానాయికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్‌ 27న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్‌, ‘ఆర్య 2’ గురించి మాట్లాడింది. తనకు అల్లు అర్జున్‌ ఎప్పటికీ ఫేవరెట్‌ హీరో అని, ‘దేశముదురు’, ‘ఆర్య 2’ సినిమాలు చాలా ఇష్టమని తెలిపింది.

అయితే ‘ఆర్య 2’లోని ఓ సన్నివేశం, అందులోని డైలాగ్‌ మాత్రం తనకు నచ్చలేదని అనన్య పేర్కొంది. లిఫ్ట్‌లో కాజల్‌ అగర్వాల్‌కు అల్లు అర్జున్‌ ముద్దు పెట్టుకునే సన్నివేశాన్ని ప్రస్తావించింది. చిన్నప్పుడు ఆ సీన్‌ క్యూట్‌గా అనిపించినప్పటికీ, వయసు పెరిగేకొద్దీ ఆలోచనల్లో మార్పు వచ్చిందని చెప్పింది. ఒక అమ్మాయి అనుమతి లేకుండా ముద్దు పెట్టుకోవడం సరైనది కాదని అభిప్రాయపడింది. ఆ సన్నివేశంపై తనకు అభ్యంతరం ఉన్నప్పటికీ అల్లు అర్జున్‌పై ఎంతో గౌరవం ఉందని స్పష్టం చేసింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!