సాధారణంగా నగరాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడితే వాహనదారుల హారన్ల మోతతో రోడ్లు మారుమోగుతుంటాయి. సిగ్నల్ దగ్గర గ్రీన్ లైట్ పడినా హారన్లు కొట్టడం, రాంగ్ రూట్లో వెళ్లడం వంటి దృశ్యాలు కనిపిస్తుంటాయి. అయితే మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడినా వాహనదారులు సహనంతో తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. అనవసరంగా హారన్లు కొట్టకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నారు.
ఐజ్వాల్ ప్రజల ట్రాఫిక్ క్రమశిక్షణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రోడ్లపై వాహనాలు భారీగా నిలిచిపోయినా ఎక్కడా హారన్ల శబ్దం వినిపించదు. వాహనదారులంతా తమకు కేటాయించిన లేన్లలోనే ఉంటూ సిగ్నల్ కోసం ప్రశాంతంగా వేచి ఉండటం వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోను మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
వినూత్నమైన, ఆలోచింపజేసే అంశాలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకునే ఆనంద్ మహీంద్రా.. ఐజ్వాల్ ట్రాఫిక్ తీరును కూడా నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లోనూ ఇలాంటి ట్రాఫిక్ క్రమశిక్షణ ఉంటే రహదారులపై పరిస్థితులు మరింత మెరుగుపడతాయని ఈ వీడియో చర్చకు దారితీస్తోంది.
Post Views: 2








