గత జూలైలో ప్రారంభమైన కొత్త ఘర్షణల నేపథ్యంలో హూతీలు దాడులను తీవ్రతరం చేసినట్లు సమాచారం. యెమెన్‌లో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వానికి చెందిన కొన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న హూతీలు.. సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ప్రతిగా సౌదీ అరేబియా కూడా యెమెన్‌లోని హూతీల స్థావరాలపై వైమానిక దాడులను పెంచినట్లు తెలుస్తోంది.
మరోవైపు సౌదీ అరేబియాకు చెందిన కీలక ఇంధన సంస్థ అరామ్‌కో కేంద్రాలను హూతీలు గతంలోనూ లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 14న తూర్పు సౌదీ అరేబియాలోని ధహ్రాన్‌లో ఉన్న అరామ్‌కో ప్రధాన కార్యాలయంపై దాడి చేసినట్లు వెల్లడించారు. ఈ దాడిలో గణనీయమైన నష్టం జరిగినట్లు సమాచారం. తాజా రాబిఘ్ దాడితో ప్రాంతీయంగా చమురు సరఫరా, ఇంధన మౌలిక సదుపాయాల భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి.








