E-PAPER

నెక్స్ట్ టార్గెట్ ఆదివాసీ ఎమ్మెల్యేలేనా? ముట్టడుల దిశ మారుతోందా.!

*కలెక్టరేట్లు, రోడ్ల ముట్టడులతో ఒరిగేదేమిటి?*

*ప్రజాప్రతినిధుల ఇళ్లవైపే ఆదివాసీ యువత చూపు?*

భద్రాద్రి కొత్తగూడెం:
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కుల పరిరక్షణ ఉద్యమం సరికొత్త మలుపు తిరుగుతోందా? మొన్నటి పాల్వంచ కలెక్టరేట్ ముట్టడి తర్వాత గిరిజన యువత, ఉద్యమకారుల్లో సరికొత్త వ్యూహాత్మక చర్చ మొదలైందా? అంటే ‘అవును’ అనే సంకేతాలే అందుతున్నాయి. ఇకపై ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్లు ముట్టడించడం కాదు… తమ సమస్యలను గాలికొదిలేసిన ఆదివాసీ ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించడమే తదుపరి లక్ష్యమనే ఆలోచన ఆదివాసీ వర్గాల్లో బలపడుతోంది.

*ఎమ్మెల్యేల మౌనంపై యువత ఆగ్రహం:*

ఆదివాసీ ప్రాంతాల్లో భూములను, గిరిజనుల హక్కులను కాపాడేందుకు ఉద్దేశించిన 1/70 వంటి కీలక చట్టాల అమలులో పాలకులు, అధికారులు విఫలమవుతున్నారనేది బహిరంగ సత్యం. అయితే, ప్రభుత్వ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు సహజమే అయినప్పటికీ, ఆదివాసీ సమాజం నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రం చట్టసభల్లో తమ జాతి ప్రయోజనాల కోసం గళమెత్తడం లేదనే అసంతృప్తి గిరిజన యువతలో తీవ్రస్థాయికి చేరింది. ఆదివాసీల ఓట్లతో గెలిచి, అగ్రవర్ణాల రాజకీయ పార్టీల అడుగులకు మడుగులొత్తుతూ తమ స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటున్నారే తప్ప, జాతి ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని యువత తీవ్రంగా ఆరోపిస్తోంది.

రోడ్లపై రాస్తారోకోలు వద్దు – ఎమ్మెల్యేల ఇళ్ల ముందే ధర్నాలు!

ఇప్పటివరకు జరిగిన ఉద్యమాల్లో నిధులు ఖర్చు చేస్తూ రోడ్లపై రాస్తారోకోలు చేయడం, హైదరాబాద్ వంటి నగరాల్లో వేదికలు పెట్టి ఫోటోలకు పరిమితం కావడం వల్ల ఎన్నో ఏళ్లుగా ఫలితం లేకుండా పోయిందని పలువురు మేధావులు, ఉద్యమకారులు విశ్లేషిస్తున్నారు. దీనికి బదులుగా, స్థానిక నియోజకవర్గాల్లోని ఆదివాసీ ఎమ్మెల్యేల ఇళ్ల ముందే శాంతియుతంగా బైఠాయించి, వారిని ప్రజాక్షేత్రంలో నిలదీయాలని, అప్పుడే ప్రభుత్వంపై నిజమైన ఒత్తిడి పెరుగుతుందని ఉద్యమ శ్రేణులు భావిస్తున్నాయి.

*పెద్దల కబ్జాలపైనే పోరు:*
ఏజెన్సీ భూముల చట్టాలు స్థానికంగా ఉన్న సామాన్య నిరుపేదలకు వ్యతిరేకం కాదని, వేలాది ఎకరాలను కబ్జా చేస్తున్న బడాబాబులకే అసలు గుబులు మొదలైందని, వారి ప్రయోజనాలను కాపాడేందుకు ఎమ్మెల్యేలు తాత్సారం చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు.మొన్నటి కలెక్టరేట్ ముట్టడి ఇచ్చిన ప్రేరణతో, ఆదివాసీ యువత తన పోరాట పంథాను నేరుగా ప్రజాప్రతినిధుల వైపు మళ్లించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సెగ అధికార, ప్రతిపక్ష గిరిజన ఎమ్మెల్యేలకు ఏ స్థాయిలో తాకనుందో వేచి చూడాల్సిందే!

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!