E-PAPER

జొమాటో నుంచి సరికొత్త టెక్నాలజీ..! రక్షణ, ఏవియేషన్‌లోనూ ‘టెంపుల్’..!

ప్రముఖ ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘జొమాటో’ త్వరలో ‘టెంపుల్’ పేరుతో సరికొత్త వేరబుల్ డివైజ్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఈ పరికరం కేవలం ఆరోగ్య పర్యవేక్షణకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో విమానయాన, రక్షణ వంటి కీలక రంగాల్లో ఉపయోగపడే అపారమైన అనువర్తనాలను కలిగి ఉందని జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ వెల్లడించారు. అత్యంత క్లిష్టమైన విధుల్లో నిమగ్నమయ్యే వ్యక్తుల శారీరక దృఢత్వాన్ని అంచనా వేయడానికి ఈ డివైజ్ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా నెటిజన్లతో సంభాషిస్తూ గోయల్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. విమానం నడపడానికి పైలట్లు ఎంతవరకు ఫిట్‌గా ఉన్నారు? నిర్దిష్ట సైనిక చర్యలకు ఏ జవాను అత్యంత సమర్థుడు? వంటి విషయాలను గుర్తించడానికి ఈ పరికరం ఎంతగానో దోహదపడుతుందని ఆయన వివరించారు. రెస్టారెంట్ల సిబ్బంది ఎదుర్కొనే ఒత్తిడిని పర్యవేక్షించవచ్చన్న ఒక యూజర్ చేసిన సూచనకు స్పందిస్తూ గోయల్ ఈ వివరణ ఇచ్చారు.

మానవ ఆలోచనలను అక్షర రూపంలోకి మార్చగల వినూత్న సాంకేతికతపై తమ పరిశోధక బృందం పనిచేస్తోందని గోయల్ వెల్లడించడం విశేషం. అయితే, ఈ టెక్నాలజీ అందుబాటులోకి రావడానికి మరికొన్నేళ్లు పట్టవచ్చని, బహుశా ‘టెంపుల్’ మూడవ లేదా నాలుగవ వెర్షన్‌లో ఇది సాధ్యం కావచ్చని ఆయన అంచనా వేశారు.

ప్రస్తుతానికి ఈ డివైజ్ ప్రధానంగా ఫిజికల్ బాడీ సెన్సింగ్, ఆరోగ్య పర్యవేక్షణపైనే దృష్టి సారించింది. ముఖ్యంగా మెదడుకు జరిగే రక్తప్రసరణలో మార్పులను నిరంతరం ట్రాక్ చేసే ‘బ్రెయిన్‌ఫ్లో’ ఫీచర్ ఇందులో కీలక పాత్ర పోషించనుంది. ఇటీవల 60 మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ టెక్నాలజీ అత్యంత కచ్చితత్వంతో పనిచేస్తున్నట్లు నిరూపితమైందని గోయల్ పేర్కొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!