కరకగూడెం మండలం, అక్టోబర్ 5 (Y7 News Telugu): కరకగూడెం మండలంలోని ప్రభుత్వ, గిరిజనుల కోసం కేటాయించిన భూముల్లో PESA చట్టం, 1/70 భూ బదలాయింపు నియంత్రణ నిబంధనలకు విరుద్ధంగా గిరిజనేతరులు చేపడుతున్న అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని తుడుందెబ్బ కరకగూడెం మండల అధ్యక్షుడు కలం సంపత్ కుమార్ డిమాండ్ చేశారు.
భట్టుపల్లి గ్రామంలోని కొమరం భీం విగ్రహం సమీపంలో ఆదివాసీల సామాజిక, సాంస్కృతిక, ప్రజా అవసరాల కోసం సర్వే నం.09లో కేటాయించిన సుమారు ఒక ఎకరం భూమిని శివరాత్రి మధు అనే వ్యక్తి ఆక్రమించి వాణిజ్య భవనాలు నిర్మించి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రశ్నించిన ఆదివాసీ సంఘాల ప్రతినిధులను సంబంధిత వ్యక్తి బెదిరింపులకు గురిచేస్తున్నాడని పేర్కొన్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల భూములు, సామూహిక వనరులు, సంప్రదాయ హక్కులను రక్షించేందుకు అమలులో ఉన్న PESA చట్టం-1996, 1/70 నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్రమ నిర్మాణాలు కొనసాగడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని కలం సంపత్ కుమార్ విమర్శించారు. చట్టాలను ఉల్లంఘించే వారికి అండగా నిలిచే అధికారులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
సర్వే నం.09కు సంబంధించిన రెవెన్యూ రికార్డులను పరిశీలించి, స్థల పరిశీలనతో పాటు సమగ్ర సర్వే నిర్వహించి భూమి హద్దులను నిర్ధారించాలని ఆయన కోరారు. నిర్మాణాలకు అవసరమైన అనుమతులు ఉన్నాయా లేదా విచారణ జరిపి, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినట్లు తేలితే భవన నిర్మాణం, వ్యాపార కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
అలాగే చట్టవిరుద్ధ ఆక్రమణలు నిర్ధారణ అయితే వాటిని తొలగించి భూమిని ఆదివాసీల ప్రయోజనాల కోసం పరిరక్షించాలని, 1/70 నిబంధనలకు విరుద్ధంగా భూ బదలాయింపు లేదా వినియోగం జరిగితే బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ పూర్తయ్యే వరకు ఆ స్థలంలో ఎలాంటి కొత్త నిర్మాణాలు, విస్తరణలు లేదా వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి ఇవ్వకూడదని స్పష్టం చేశారు.
ఈ అంశంపై PESA గ్రామసభ అభిప్రాయం, తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకుని అధికారులు చేపట్టిన విచారణ, చర్యల వివరాలను లిఖితపూర్వకంగా ప్రజలకు తెలియజేయాలని కలం సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివాసీల హక్కులను కాలరాస్తూ అక్రమ నిర్మాణాలు కొనసాగితే తుడుందెబ్బ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధమైన ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
– దిలీప్ కుమార్, కరకగూడెం మండలం ప్రతినిధి, Y7 News Telugu









