రోడ్డు ప్రమాదమా.. మరేదైనా జరిగిందా?
దాడి చేసి ప్రమాదంగా చిత్రీకరించారన్న బంధువుల అనుమానం
చుంచుపల్లి, అక్టోబర్ 5(Y7 న్యూస్)
చుంచుపల్లి మండలం చుంచుపల్లి తండాకు చెందిన ధరావత్ హరికృష్ణ (37) ఆదివారం అర్ధరాత్రి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. హౌసింగ్ బోర్డు నుంచి చుంచుపల్లి తండాకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మార్గమధ్యలో వాహనం అదుపుతప్పి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. ప్రమాద సమయంలో హరికృష్ణ మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.అయితే రాత్రివేళ ఒంటరిగా ప్రయాణిస్తున్న హరికృష్ణ ప్రమాదానికి గురై మృతి చెందడంపై మృతుడి బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా దాడి చేసి అనంతరం ప్రమాదంగా చిత్రీకరించి ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలోనూ పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నారు.మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ప్రమాదంతో పాటు ఇతర అనుమానాస్పద కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.









