E-PAPER

‘విమానమే అతడి ప్రపంచం..! కెప్టెన్ స్మిత్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..

ఫ్లైదుబాయి విమానంలో చావు బతుకుల మధ్య జరిగిన పోరాటం గురించి వింటే ఏ తల్లిదండ్రులైనా విలవిలలాడిపోతారు. అల్మారాలోని గొడ్డలితో కో-పైలట్ తమ బిడ్డపై దాడికి తెగబడినప్పుడు పైలట్ స్మిత్ మచ్ఛర్ ఇంట్లోనూ అదే పరిస్థితి. విషయం తెలియగనే ఒక్కసారిగా స్మిత్ తల్లిదండ్రులు భయపడిపోయారు. తన బిడ్డకు ఏం జరిగిందోనని కంగారు పడిపోయారు. ఘటన సమయంలో తాము ఎదుర్కొన్న భావోద్వేగ పరిస్థితులను స్మిత్ తండ్రి భూపేంద్ర మచ్చర్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రస్తుతం అవి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

వార్త వినగానే తీవ్రమైన షాక్‌కు గురయ్యామని ఏం చేయాలో పాలుపోక వెంటనే ఇంట్లోని దేవుడి పటాల ముందు దీపం వెలిగించామని స్మిత్ తండ్రి భూపేంద్ర మచ్ఛర్ తెలిపారు. ‘ఏ తల్లిదండ్రులైనా ముందుగా భయపడతారు. మేం కూడా అలాగే భయపడ్డాం. కానీ వెంటనే తేరుకొని దేవుడా మా అబ్బాయికి ఎలాంటి చెడు జరగకూడదు. ఎలాగైనా అతడిని కాపాడు అని వేడుకున్నాం’ అని భూపేంద్ర మచ్ఛర్ గుర్తుచేసుకున్నారు.

తన కొడుకుకు విమానాలు నడపడమంటే ఎంత ప్రాణమో చెబుతూ భూపేంద్ర మచ్చర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అతడికి ఫ్లయింగ్ అంటే ప్రాణం, విమానమే అతడి భార్య లాంటిది’ అని చమత్కరించారు. గత 17 ఏళ్లుగా పైలట్‌గా సేవలు అందిస్తున్న స్మిత్.. తోటి పైలట్లకు నేర్పించడంలో, వారికి మార్గదర్శనం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడని తెలిపారు. విమానం నడపడం తప్ప మరో ఆలోచన అతడికి ఉండదని కొడుకుపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు.

ప్రస్తుతం స్మిత్ అబుదాబిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఆయన తలకు, రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయని, తలకు శస్త్రచికిత్స చేసి కుట్లు కూడా వేశారని ఆయన తండ్రి చెప్పారు. గాయాలు చాలా పెద్దవి కావడంతో కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే మళ్లీ విధుల్లో చేరుతాడని ఆయన స్పష్టం చేశారు.

దేశమంతా తన కొడుకు ధైర్యాన్ని మెచ్చుకుంటుంటే గర్వంగానే ఉందని, అయితే ఒక తండ్రిగా తన కొడుకు ఆరోగ్యం బాగుపడటమే తనకు ముఖ్యమని భూపేంద్ర చెప్పారు. ‘ప్రజలంతా ఇది గర్వించదగ్గ క్షణం అంటున్నారు. కానీ నాకూ, నా భార్యకు, నా కోడలికి మాత్రం అతడు త్వరగా కోలుకోవడమే ప్రధానం’ అని భావోద్వేగానికి గురయ్యారు.

ఇదే సమయంలో నేటి తరం (Gen Z) యువతకు భూపేంద్ర మచ్ఛర్ ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. ‘స్మిత్ తన తల్లిదండ్రులకు ఎంత గౌరవం ఇస్తాడో, ఎంత ఒదిగి ఉంటాడో యువత గమనించాలి. మన ఆలోచనలు, చేసే పనులు మంచిగా ఉంటే ఎంతటి కష్ట సమయంలోనైనా దేవుడు మన పక్కనే ఉంటాడు. నిజాయితీ, సత్యమే ఎప్పుడైనా గెలుస్తాయి’ అని ఆయన పేర్కొన్నారు.

ఫ్లైదుబాయ్ విమానంలో ఉన్న ఒమన్ దేశస్తుడైన కో-పైలట్ ఒక్కసారిగా గొడ్డలితో స్మిత్‌పై దాడికి దిగాడు. తీవ్రమైన గాయాలవుతున్నా విమానం కిందకు పడిపోతున్నా స్మిత్ ధైర్యాన్ని వీడలేదు. ‘ఇప్పుడు పోరాడకపోతే ఎవ్వరూ బతకరు’ అని గ్రహించి ప్రాణాలను పణంగా పెట్టి కాక్‌పిట్ తలుపులు తెరిచి బయట ఉన్న సిబ్బందిని, ప్రయాణికులను హెచ్చరించాడు. ఆ తర్వాత ప్రయాణికులు ఆ దాడి చేసిన వ్యక్తిని పట్టుకోగా.. విమానంలో ఉన్న మరో పైలట్ సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!