పలాస, అక్టోబర్ 2 (Y7 న్యూస్ తెలుగు): రైళ్లలో ప్రయాణికుల మొబైల్ ఫోన్లను చోరీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పలాస గవర్నమెంట్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 10 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
విశాఖపట్నం రైల్వే లైన్స్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎ. రవికుమార్ ఆదేశాలు, పర్యవేక్షణలో రైల్వే ప్రయాణికుల భద్రత కోసం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఈ విజయవంతమైన ఆపరేషన్ చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం, ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా ఖలికోట ప్రాంతానికి చెందిన జగన్ బెహెరా మరియు బుండబానా జాలి అనే ఇద్దరు వ్యక్తులు రైళ్లలో ప్రయాణిస్తూ, ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని మొబైల్ ఫోన్లను చోరీ చేస్తున్నట్లు గుర్తించారు. ఖలికోట–పలాస–శ్రీకాకుళం రైల్వే మార్గంలో నడిచే రైళ్లలో ప్రయాణికుల దృష్టి మరలిన సమయంలో ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది.
నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 10 మొబైల్ ఫోన్లలో కొన్ని గతంలో నమోదైన మొబైల్ చోరీ కేసులకు సంబంధించినవిగా పోలీసులు గుర్తించారు. ఫోన్లను సాంకేతికంగా పరిశీలించి అసలు యజమానులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.
నిందితులను అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఆపరేషన్‌లో పలాస GRP ఎస్సై దుంపల శ్రీనివాసరావు, క్రైమ్ డిటెక్షన్ టీమ్ సిబ్బంది ఎం. సంతోష్ కుమార్, బి. దేవేంద్రనాథ్, అలాగే పలాస RPF/CPDS ఎస్సై టి. నిఖిల్ కుమార్ మరియు సిబ్బంది రాజుల కుమార్, సీహెచ్. శంకర్, ఎం. బాలకృష్ణ పాల్గొన్నారు.
రైల్వే ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లు, విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పలాస GRP ఎస్సై శ్రీనివాసరావు సూచించారు.









