చింతూరు, అక్టోబర్ 1 (వై7 న్యూస్ తెలుగు): పోలవరం జిల్లా చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీఓ) మరియు సబ్ కలెక్టర్‌గా 2024 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన చిట్టపులి నరేంద్ర పడాల్ నియమితులయ్యారు.
ఆదివాసీ నేపథ్యం కలిగిన యువ అధికారి అయిన నరేంద్ర పడాల్, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల సమర్థ అమలు కోసం కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, రహదారులు తదితర మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు.
మారుమూల గిరిజన గ్రామాల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకుంటానని ఆయన వెల్లడించారు.
చిట్టపులి నరేంద్ర పడాల్ నియామకంతో చింతూరు ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.








