చింతూరు, (వై7 న్యూస్ తెలుగు) అక్టోబర్ 01:
పోలవరం జిల్లాలోని చింతూరు మండలం గుడూరు గ్రామంలో చేపట్టిన క్వార్ట్జ్ (తెల్లరాయి) ఖనిజం ఈ వేలానికి ప్రభుత్వానికి రూ.6,89,400 ఆదాయం లభించింది.
గ్రామంలో సిద్ధంగా ఉన్న 150 మెట్రిక్ టన్నుల క్వార్ట్జ్ (తెల్లరాయి) ఖనిజానికి ఆన్‌లైన్ ద్వారా డిమాండ్ డ్రాఫ్ట్ (డిడి) చెల్లింపుల విధానంలో ప్రభుత్వం విక్రయ ప్రక్రియను నిర్వహించింది.
ఈ బహిరంగ వేలం పాటలో చింతూరుకు చెందిన ‘శ్రీ సూర్య భవ్య మినరల్స్’ సంస్థ అత్యధిక మొత్తాన్ని పాడుకుని వేలాన్ని దక్కించుకుందని జిల్లా భూగర్భ శాస్త్ర, గనుల శాఖ అధికారి
జి. కృష్ణమూర్తి తెలిపారు. నిబంధనల ప్రకారం వేలం సొమ్ము రూ.6,89,400లను సదరు సంస్థ ప్రభుత్వానికి చెల్లించినట్లు చెప్పారు.
కాగా చింతూరు మండలం లోని గుడూరు, మదుగూరు గ్రామాల శివారు ప్రాంతాల్లో అక్రమంగా అనుమతులు లేకుండా తెల్ల రాయిని తవ్వుతున్నారన్న ఆరోపణలపై జిల్లా మైనింగ్ శాఖ అధికారి జి. కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కొంతమంది అధికారుల బృందం గతంలో తనిఖీ లు జరిపారు. ఆ ప్రాంతంలో గుర్తించిన తెల్లరాయి గుట్టలను, తవ్వి తీసిన నిల్వలను స్వాధీనం చేసుకొని రెవిన్యూ అధికారులకు అప్పగించారు. అప్పుడు సీజ్ చేసిన తెల్లరాయి కి ఇప్పుడు వేలం ప్రక్రియ నిర్వహించారు.








