కార్గిల్ యుద్ధ వీరుడు, రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ అమిత్ కుమార్ గుప్తాపై ఇనుప రాడ్‌తో దాడి చేసిన కేసులో పార్కింగ్ అటెండెంట్‌ను గురుగ్రామ్ పోలీసులు అరెస్టు చేశారు. హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా కోట్ గ్రామానికి చెందిన 24 ఏళ్ల దీపక్ మావీని అదుపులోకి తీసుకున్నారు. పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదమే దాడికి కారణమని పోలీసులు తెలిపారు.
సెప్టెంబర్ 10న గురుగ్రామ్‌లోని సెక్టార్ 58లో ఉన్న మాగ్నమ్ గ్లోబల్ పార్క్ వాణిజ్య సముదాయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అమిత్ కుమార్ గుప్తా కుటుంబంతో కలిసి గోంజో రెస్టారెంట్‌కు డిన్నర్‌కు వెళ్లారు. రాత్రి సుమారు 8 గంటలకు కుటుంబ సభ్యులను రెస్టారెంట్లో వదిలి కారు పార్క్ చేసేందుకు వెళ్లారు.
పార్కింగ్ సిబ్బంది తనను వాలెట్, బేస్మెంట్, మల్టీ లెవల్ పార్కింగ్ ప్రాంతాల వైపు తిప్పుతూ చివరకు కారు పార్క్ చేసేందుకు నిరాకరించారని గుప్తా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో వివాదం తలెత్తి తనపై ఇనుప రాడ్‌తో దాడి చేసినట్లు ఆయన ఆరోపించారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి దీపక్ మావీని అరెస్టు చేశారు.









