ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాలు పరస్పరం తమ ఇంధన మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయకూడదని అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ నిర్ణయం యుద్ధ ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ముందడుగుగా అభివర్ణించారు. ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా డీజిల్ ధరలు పెరగడానికి ప్రధాన కారణం రష్యా-ఉక్రెయిన్ యుద్ధమేనని ట్రంప్ పేర్కొన్నారు. దీనికి ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం కారణం కాదని స్పష్టం చేశారు. రష్యాలోని డీజిల్ మౌలిక వసతులపై ఉక్రెయిన్ దాడులు చేయకుండా అధ్యక్షుడు జెలెన్స్కీ చర్యలు తీసుకోవాలని అంతకుముందు సూచించినట్లు తెలిపారు.
ఉక్రెయిన్ దాడుల కారణంగా డీజిల్ కొరత ఏర్పడి ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. లక్ష్యాలపై దాడులు చేయడాన్ని తాను పూర్తిగా వ్యతిరేకించడం లేదని, అయితే డీజిల్ ఉత్పత్తి కేంద్రాలు, ఇంధన మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకోవద్దని సూచించారు. ఇరు దేశాల తాజా అంగీకారం యుద్ధ పరిస్థితుల్లో ఉద్రిక్తతలను కొంతమేర తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు.









