ప్రస్తుత కాలంలో మొబైల్ నంబర్ కేవలం కాల్స్, మెసేజ్‌లకే పరిమితం కాదు. బ్యాంకు ఖాతాలు, యూపీఐ, సోషల్ మీడియా, ఇతర ఆన్‌లైన్ సేవలతో మొబైల్ నంబర్ అనుసంధానమై ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో సిమ్ కార్డ్ వేరే వారి చేతికి చిక్కినా, దుర్వినియోగం జరిగినా ఆర్థికంగా, వ్యక్తిగతంగా నష్టం జరిగే అవకాశం ఉంది.
ఇలాంటి ప్రమాదాలను తగ్గించేందుకు ఫోన్‌లోని SIM Lock ఫీచర్ ఉపయోగపడుతుంది. దీన్ని ఎనేబుల్ చేసిన తర్వాత సిమ్‌ను మరో ఫోన్‌లో పెట్టినా లేదా ఫోన్‌ను రీస్టార్ట్ చేసినా సిమ్ పిన్ అడుగుతుంది. సరైన పిన్ నమోదు చేయకపోతే సిమ్ ద్వారా కాల్స్, మెసేజ్‌లు, మొబైల్ నెట్‌వర్క్ సేవలను ఉపయోగించడం సాధ్యం కాదు.
ఫోన్ లేదా సిమ్ కార్డ్ పోయినప్పుడు ఈ ఫీచర్ అదనపు రక్షణను అందిస్తుంది. ముఖ్యంగా మొబైల్ నంబర్‌తో బ్యాంకింగ్, యూపీఐ, సోషల్ మీడియా ఖాతాలు అనుసంధానమై ఉన్నవారు SIM Lockను ఉపయోగించడం ద్వారా భద్రతను మరింత పెంచుకోవచ్చు. అయితే SIM PINను గుర్తుండేలా భద్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.








