తూర్పు కాంగోలోని బుకావు నగరంలో గురువారం జరిగిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ నివాస గృహంలో మొదలైన మంటలు క్షణాల్లో పక్కనే ఉన్న రెండు పాఠశాలలకు వ్యాపించాయి. ఈ ఘటనలో 19 మంది బాలికలు, ఐదుగురు బాలురు సహా మొత్తం 24 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. దట్టమైన పొగతో ఊపిరాడక, తప్పించుకునే క్రమంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు మృతి చెందినట్లు సమాచారం.
బుకావు నగరంలోని జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో ఎక్కువగా చెక్క నిర్మాణాలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. అగ్నికీలలు పక్కనే ఉన్న ఫురాహా సెకండరీ స్కూల్, ఉజామా ప్రైమరీ స్కూల్ ప్రాంగణాలకు చేరుకున్నాయి. తరగతి గదుల్లో ఉన్న విద్యార్థులు ప్రమాదాన్ని గుర్తించి బయటకు వచ్చేలోపే దట్టమైన పొగ వారిని చుట్టుముట్టినట్లు సమాచారం.
ఎం23 నిరసనకారుల ప్రతినిధి లారెన్స్ కాన్యుకా తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో 19 మంది విద్యార్థినులు, ఐదుగురు బాలురు మృతి చెందారు. ఘటనతో విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, మంటలు ఎలా ప్రారంభమయ్యాయనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.








