దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ఢిల్లీ శాసనసభ, ప్రముఖ సర్దార్ పటేల్ విద్యాలయ (SPV) పాఠశాలతో పాటు పలు కీలక ప్రభుత్వ కార్యాలయాలకు మంగళవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ఇమెయిల్ ద్వారా బెదిరింపులు పంపినట్లు సమాచారం. దీంతో అధికారులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
బెదిరింపు సమాచారం అందుకున్న వెంటనే భద్రతా బలగాలు ఆయా ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాయి. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు, పోలీసు బృందాలు రంగంలోకి దిగి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాల కోసం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాయి. ముందస్తు జాగ్రత్తగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
వరుసగా కీలక ప్రాంతాలకు బెదిరింపు ఇమెయిల్స్ రావడంతో అధికారులు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. బెదిరింపులు ఎవరి నుంచి వచ్చాయి? వాటి వెనుక ఉద్దేశం ఏమిటనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇమెయిల్స్ మూలాన్ని గుర్తించేందుకు సైబర్ నిపుణుల సహకారంతో విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.








