దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున కాంబినేషన్ అనగానే భక్తిరస చిత్రాలుగా ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ సినిమాలు వెంటనే గుర్తుకొస్తాయి. అయితే వీరిద్దరి కలయికలో తెరకెక్కిన మూడో భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’ మాత్రం మిగిలిన రెండు సినిమాలకు పూర్తిగా భిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి పరమ భక్తుడైన హాథీరామ్ బావాజీ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఆయన జీవితానికి సంబంధించిన పూర్తి చారిత్రక వివరాలు అందుబాటులో లేకపోవడంతో.. దర్శకుడు రాఘవేంద్రరావు తనదైన సృజనాత్మకతతో కథను రూపొందించారు. భక్తి, ఆధ్యాత్మికతతో పాటు హాథీరామ్ బావాజీ జీవితంలోని పలు కోణాలను సినిమాలో ఆవిష్కరించారు.
‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ చిత్రాల్లో కనిపించిన భక్తి కోణానికి భిన్నంగా ‘ఓం నమో వేంకటేశాయ’లో వైరాగ్య భావనకు పెద్దపీట వేశారు. భగవంతుడిపై అచంచలమైన భక్తి, ఆధ్యాత్మిక అన్వేషణ, వైరాగ్యంతో కూడిన జీవన విధానాన్ని నాగార్జున తన పాత్ర ద్వారా అద్భుతంగా చూపించారు. దీంతో ఈ చిత్రం రాఘవేంద్రరావు–నాగార్జున కాంబినేషన్లో ఓ ప్రత్యేకమైన భక్తిరస చిత్రంగా నిలిచింది.








