భద్రాచలం, సెప్టెంబర్ 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎటపాక మండలం గొల్లగొప్ప గ్రామంలో నిర్వహించిన వైద్య శిబిరం అనంతరం 53 మంది పిల్లలు అస్వస్థతకు గురైన ఘటనపై తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనలో ఒక చిన్నారి మృతి చెందడం అత్యంత విషాదకరమని సంఘం భద్రాచలం పట్టణ కార్యదర్శి కుంజా శ్రీను పేర్కొన్నారు.
వైద్య శిబిరంలో మందులు అందించిన అనంతరం పిల్లలు స్పృహ కోల్పోవడం ఆందోళనకర విషయమని, ప్రస్తుతం బాధితులు భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే సమగ్ర, నిష్పక్షపాత విచారణ చేపట్టి అసలు కారణాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఆదివాసీ ప్రాంతాల్లో నిర్వహించే వైద్య శిబిరాల్లో మందుల నాణ్యత, సరైన మోతాదు, వైద్యుల పర్యవేక్షణ వంటి అంశాల్లో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అస్వస్థతకు గురైన పిల్లలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు, మృతి చెందిన చిన్నారి కుటుంబానికి తక్షణ నష్టపరిహారం, పూర్తి వైద్య మరియు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలుగు రాష్ట్రాల్లో ఆదివాసీ మహిళలు, పిల్లలు మరియు ప్రజలకు రక్షణతో కూడిన నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడంలో ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కుంజా శ్రీను సూచించారు. ఆదివాసీ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది, అత్యవసర వైద్య సదుపాయాలు, నాణ్యమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఆదివాసీ ప్రజల ఆరోగ్యంతో నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని సహించబోమని హెచ్చరించిన ఆయన, గొల్లగొప్ప ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.









