నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు మరోసారి హిమాలయ ప్రాంతాల్లోని హిమానీనద సరస్సుల భద్రతపై ఆందోళనలు పెంచుతున్నాయి. నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో హిమానీనదం విస్ఫోటనం కారణంగా భోటేకోశి, త్రిశూలి నదుల్లో భారీగా వరదలు సంభవించినట్లు సమాచారం. ఈ వరదలతో మధ్య నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం జరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. హిమాలయ ప్రాంతాల్లో అడపాదడపా కురుస్తున్న భారీ వర్షాలు పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. టిబెట్‌లో నదుల మూల ప్రాంతానికి సమీపంలో కొత్తగా తాత్కాలిక సరస్సు ఏర్పడినట్లు సమాచారం. దీంతో భోటేకోశి నదిలో నీటిమట్టం మరోసారి పెరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నది దిగువ ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తత ప్రకటించి, ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
నేపాల్‌లో చోటుచేసుకున్న తాజా పరిణామాలతో భారత హిమాలయ ప్రాంతాల్లో ఉన్న హిమానీనద సరస్సుల భద్రతపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాతావరణ మార్పులు, హిమనదుల కరుగుదల, ఆకస్మికంగా పెరుగుతున్న నీటిమట్టాలు భవిష్యత్‌లో మరిన్ని వరదలకు కారణమయ్యే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో హిమాలయ ప్రాంతాల్లోని హిమానీనద సరస్సులను నిరంతరం పర్యవేక్షించడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం అత్యవసరంగా మారింది.








