ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ను కలవడం అంటే సింహం బోనులోకి వెళ్లినట్టేనని ఆ దేశ మాజీ దౌత్యవేత్త లీ ఇల్-గ్యు సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణ దేశాధినేతలను కలవడం, కిమ్‌ను కలవడం పూర్తిగా భిన్నమని ఆయన తెలిపారు. కిమ్‌ను కలిసే సమయంలో చేసే చిన్న పొరపాటు కూడా తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని పేర్కొన్నారు.
కిమ్‌ను కలవాల్సిన వ్యక్తులకు దాదాపు నెల రోజుల పాటు కఠిన శిక్షణ ఇస్తారని లీ ఇల్-గ్యు వెల్లడించారు. సమావేశంలో ఎలా మాట్లాడాలి, ఎలాంటి హావభావాలు ప్రదర్శించాలి, కిమ్‌తో ఎలా ప్రవర్తించాలి అనే అంశాలపై ప్రత్యేకంగా శిక్షణ ఉంటుందని తెలిపారు. సమావేశంలో ప్రతి కదలిక, ప్రతి మాట ఎంతో జాగ్రత్తగా ఉండేలా ముందుగానే సిద్ధం చేస్తారని వివరించారు.
తాను స్వయంగా కిమ్ జోంగ్ ఉన్‌ను ఏడు సార్లు కలిశానని లీ ఇల్-గ్యు తెలిపారు. ప్రతిసారి సమావేశానికి ముందు తాను కూడా ప్రత్యేక శిక్షణ తీసుకున్నానని వెల్లడించారు. కిమ్‌ను కలిసే సమయంలో ప్రోటోకాల్‌ను ఏమాత్రం ఉల్లంఘించకుండా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.








