బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గతంలో చేసిన “సోనమ్, ఇట్స్ డన్ బ్రో” అనే వైరల్ వ్యాఖ్యలపై ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ తొలిసారిగా స్పందించారు. సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్య వెనుక ఉన్న భావనను తాను గౌరవిస్తానని ఆయన తెలిపారు. అదే సమయంలో సెలబ్రిటీలు ఎదుర్కొనే ఒత్తిళ్లను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వాంగ్చుక్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ తమకంటూ కొన్ని పరిమితులు, ఒత్తిళ్లు ఉంటాయని అన్నారు. ఏదైనా విషయంపై స్పందించే ముందు అన్ని కోణాల్లో ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వ్యక్తుల పరిస్థితులు, వారి ఎదుర్కొనే ఒత్తిళ్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
“ప్రతి ఒక్కరికీ వారి వారి పరిమితులు, ఒత్తిళ్లు ఉంటాయి. అన్ని వైపుల నుంచి ఆలోచించాల్సి ఉంటుంది. కానీ ఆయన ఏది చెప్పినా నేను దానిని గౌరవిస్తాను” అని వాంగ్చుక్ హిందీలో పేర్కొన్నారు. దీంతో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలపై ఆయన స్పందన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.








