మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ పదే పదే తగ్గిపోతుంటే చాలామంది వెంటనే నెట్వర్క్ సెట్టింగ్స్ చెక్ చేస్తారు. లేదంటే డేటా ప్యాక్ అయిపోయిందేమోనని అనుకుంటారు. అయితే ఇలాంటి సమయంలో చాలామందికి వచ్చే సాధారణ సందేహం.. పాత సిమ్ కార్డును తీసేసి కొత్త సిమ్ వేస్తే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందా? అనేదే. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దీనికి సమాధానం ‘అవును’ కావచ్చు.
అయితే కేవలం సిమ్ కార్డు మార్చినంత మాత్రాన ప్రతీసారీ ఇంటర్నెట్ రాకెట్ స్పీడ్‌తో పనిచేస్తుందని భావించడం పొరపాటే. పాత సిమ్ చాలా కాలం క్రితంది కావడం, కొత్త నెట్వర్క్ టెక్నాలజీలకు సపోర్ట్ లేకపోవడం లేదా సిమ్‌లో సాంకేతిక సమస్యలు ఉండటం వంటి సందర్భాల్లో కొత్త సిమ్ ఉపయోగపడొచ్చు. ముఖ్యంగా 4G, 5G సేవలకు అనుకూలమైన సిమ్ అవసరమైనప్పుడు దాన్ని అప్‌గ్రేడ్ చేయడం వల్ల ప్రయోజనం ఉండే అవకాశం ఉంది.
అయితే ఇంటర్నెట్ స్పీడ్ అనేది సిమ్‌పై మాత్రమే ఆధారపడదు. మీ ప్రాంతంలో నెట్వర్క్ కవరేజ్, టవర్‌కు ఉన్న దూరం, ఒకేసారి నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య, ఫోన్ సామర్థ్యం, నెట్వర్క్ సెట్టింగ్స్, డేటా ప్లాన్ వంటి అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి సిమ్ మార్చే ముందు ఈ కారణాలను కూడా పరిశీలిస్తే అసలు సమస్య ఎక్కడుందో సులభంగా గుర్తించవచ్చు.








