హీరోయిన్లు నటనతో పాటు నిర్మాణ రంగంలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సమంత, నయనతార, వరలక్ష్మీ శరత్ కుమార్ ఇప్పటికే నిర్మాతలుగా సినిమాలు తెరకెక్కించగా.. ఇప్పుడు నిత్యామీనన్ కూడా అదే బాటలో అడుగులు వేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘కేయూరీ ప్రొడక్షన్స్’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించిన నిత్య.. క్రియేటివ్ కథలను ప్రేక్షకులకు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
నిత్యామీనన్‌కు ప్రొడక్షన్ కొత్తేమీ కాదు. గతంలో ‘స్కైలాబ్’ సినిమాకు కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది. అయితే కరోనా సమయంలో విడుదలైన ఈ సినిమా కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో నిర్మాణ రంగానికి కాస్త దూరంగా ఉంది. తాజాగా మరోసారి నిర్మాతగా రిస్క్ చేసేందుకు సిద్ధమైంది. ‘కావలై వెండం’ ఫేమ్ డీకే చెప్పిన కథ నచ్చడంతో ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో నిత్యామీనన్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనుందని టాక్. ప్రముఖ దర్శకుడు విక్రమ్ కె. కుమార్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా కోసం నిత్య రెమ్యునరేషన్ తగ్గించుకుని, ప్రాఫిట్ షేర్ విధానంలో పేమెంట్ తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘భీమ్లా నాయక్’ తర్వాత తెలుగులో వెండితెరపై కనిపించని నిత్యామీనన్.. ఈ కొత్త ప్రాజెక్టుతో టాలీవుడ్లోకి ఎప్పుడు రీఎంట్రీ ఇస్తుందో చూడాలి.








