ఇటలీలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 98 అడుగుల పొడవున్న విలాసవంతమైన ‘అంజియోలా II’ యాచ్ సముద్రంలో మునిగిపోయింది. కొత్త యజమానికి డెలివరీ చేసిన కేవలం నాలుగు రోజులకే ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది. యాచ్‌లో అగ్నిప్రమాదం సంభవించిన అనంతరం లోపలికి నీరు చేరడంతో చివరకు అది సముద్రంలో పూర్తిగా మునిగిపోయింది.
సార్డీనియా ద్వీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పోర్టో సెర్వో సమీపంలో మంగళవారం ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం యాచ్‌లో ఇంజిన్ వైఫల్యం కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మంటలు వ్యాపించిన తర్వాత యాచ్‌లోకి నీరు చేరడం ప్రారంభమైంది. దీంతో అది క్రమంగా ఒకవైపునకు ఒరిగి సముద్రంలో మునిగిపోయింది.
ప్రమాద సమయంలో యాచ్‌లో మొత్తం 14 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వారందరినీ సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోల్లో భారీ యాచ్ నెమ్మదిగా సముద్రంలోకి అదృశ్యమవుతున్న దృశ్యాలు కనిపించాయి. ఘటనకు గల పూర్తి కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.








