విద్యార్థుల ఆందోళనలపై తొలిసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో విద్యార్థుల సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ భవిష్యత్తును నిర్మించేది విద్యార్థులేనని పేర్కొన్న ఆమె.. యువతను రక్షించడంతో పాటు వారికి న్యాయమైన, సురక్షితమైన పరీక్షా వ్యవస్థను అందించాల్సిన అవసరం ఉందన్నారు.
విద్యార్థుల వర్తమానం, భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం, సమాజం కలిసి పనిచేయాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. జాతీయ భద్రత కోసం దేశమంతా ఐక్యంగా ఉండటం ఎంత అవసరమో.. విద్యార్థుల ప్రయోజనాల విషయంలోనూ అదే స్థాయిలో సమష్టి కృషి అవసరమని ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వ పరీక్షా వ్యవస్థలో సమగ్ర మార్పులు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు ద్రౌపది ముర్ము తెలిపారు. ముఖ్యంగా పబ్లిక్ పరీక్షల్లో అక్రమ పద్ధతులు, మోసాలను అరికట్టడంతో పాటు పరీక్షల ప్రక్రియను మరింత పారదర్శకంగా, సురక్షితంగా, విశ్వసనీయంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. పరీక్షా విధానంలో సంస్కరణలు రాబోతున్నట్లు ఆమె స్పష్టం చేశారు.








