దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీకర్ మెడికల్ కాలేజ్-హాస్పిటల్లో మహిళా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధిత వైద్యురాలి మృతదేహానికి హడావిడిగా అంత్యక్రియలు నిర్వహించారనే ఆరోపణలపై మాజీ టీఎంసీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉత్తర 24 పరగణాల జిల్లా ఖర్దా పోలీస్ స్టేషన్ నుంచి ఆయనను కోర్టుకు తరలిస్తుండగా ఆగ్రహంతో ఉన్న ప్రజలు దాడికి యత్నించారు.
నిర్మల్ ఘోష్‌ను పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ గుంపు ఆయనపై పిడిగుద్దులు, కాళ్లతో దాడి చేసింది. అంతటితో ఆగకుండా బూట్లు, చెప్పులు, గుడ్లు, బురదను విసిరారు. కొందరు ఆయనకు బూట్ల దండ కూడా వేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భద్రతా సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది.
ఈ కేసులో నిర్మల్ ఘోష్‌తో పాటు ఆయన సన్నిహితుడు, పానిహటి మాజీ కౌన్సిలర్ సంజీబ్ ముఖర్జీ కూడా అరెస్టయ్యారు. ముఖర్జీని ఘోష్ కంటే ఒక రోజు ముందే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం బాధిత వైద్యురాలి మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించే సమయంలో ముఖర్జీ అక్కడే ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేసు దర్యాప్తు మరింత కీలకంగా మారింది.








