పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) అధినేత ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారంటూ పాకిస్థాన్‌లో ప్రచారం మొదలైంది. అవినీతి కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన రావల్పిండిలోని అడియాల జైలులో కన్నుమూశారంటూ వార్తలు వెలువడ్డాయి. ఈ ప్రచారంతో పాకిస్థాన్‌లో రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అమెరికాలో నివసిస్తున్న పాకిస్థానీ జర్నలిస్ట్ వజాహత్ సయీద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చాయి. రావల్పిండిలోని పాకిస్థాన్ ఆర్మీ జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ సైనికాధికారులు ఇమ్రాన్ ఖాన్ ఇక బతికి ఉండకపోవచ్చని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నట్లు సమాచారం.
అయితే, ఆ ముగ్గురు అధికారులు ఇమ్రాన్ ఖాన్‌ను స్వయంగా చూసి ఆయన మృతిని నిర్ధారించలేదని కూడా స్పష్టం చేశారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ నిజంగా మృతి చెందారా? లేక ఇది కేవలం పుకార్లేనా? అనే అనుమానాలు కొనసాగుతున్నాయి. అధికారికంగా ఇమ్రాన్ ఖాన్ మృతిని ధృవీకరించే సమాచారం వెలువడే వరకు ఈ ప్రచారాన్ని నిర్ధారిత వార్తగా పరిగణించలేమని తెలుస్తోంది.








