ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి హ్యాండ్ బ్యాగ్‌లో పుర్రె కనిపించడంతో కలకలం రేగింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణికుడి బ్యాగ్‌ను ప్రీ-ఎంబార్కేషన్ సెక్యూరిటీ చెక్‌లో తనిఖీ చేస్తుండగా సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అనుమానాస్పద వస్తువు కనిపించింది. దీంతో బ్యాగ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయగా అందులో పుర్రె బయటపడింది.
అధికారులు ప్రయాణికుడిని ప్రశ్నించగా, అది కోతి పుర్రె అని చెప్పినట్లు సమాచారం. వెంటనే పుర్రెను స్వాధీనం చేసుకున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది, తదుపరి విచారణ కోసం ప్రయాణికుడిని పోలీసులకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న పుర్రెను పరీక్షల కోసం భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో వన్యప్రాణులకు సంబంధించిన అంశం ఉండటంతో వైల్డ్‌లైఫ్ (ప్రొటెక్షన్) యాక్ట్, 1972 నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అసలు ఆ పుర్రె ప్రయాణికుడికి ఎలా లభించింది? దాన్ని ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ఎందుకు తీసుకెళ్తున్నాడు? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పుర్రెపై పరీక్షలు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.








