ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్‌లో తొలి AAA సినిమాస్ మల్టీప్లెక్స్‌ను విశాఖపట్నంలో ఆగస్టు 9న ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు వేగంగా పూర్తి చేస్తుండగా, అల్లు అర్జున్ స్వయంగా ప్రారంభోత్సవానికి హాజరుకానుండటంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.
ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందుకున్న అతిథులకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. అభిమానుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమం పూర్తయ్యే వరకు, అల్లు అర్జున్ అక్కడి నుంచి వెళ్లే వరకు మాల్‌ను సాధారణ ప్రేక్షకులకు అందుబాటులో ఉంచకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
తెలంగాణలో మంచి గుర్తింపు తెచ్చుకున్న AAA సినిమాస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా తన కార్యకలాపాలను విస్తరించనుంది. విశాఖలో ప్రారంభం కానున్న ఈ మల్టీప్లెక్స్‌లో అత్యాధునిక సౌకర్యాలు, అత్యుత్తమ థియేటర్ అనుభూతిని అందించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా అభిమానులు సంయమనం పాటించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.








