కాంగోలో ఎబోలా వైరస్ మహమ్మారి తీవ్రరూపం దాల్చుతోంది. ఇప్పటివరకు 1,031 మంది మృతి చెందినట్లు ‘ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జీన్ కాసెయా ఘనాలో జరిగిన ఆరోగ్య సదస్సులో ప్రకటించారు. ఇది చరిత్రలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఎబోలా ప్రకోపాల్లో ఒకటిగా నమోదవుతోంది.
కాంగో ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, సోమవారం నాటికి 2,473 ఎబోలా కేసులు నమోదయ్యాయి. వీరిలో కనీసం 737 మంది రోగులు ఐసోలేషన్ కేంద్రాలు లేదా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తగినన్ని వ్యాక్సిన్లు, మందులు, నిధులు లేకపోవడం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని డాక్టర్ జీన్ కాసెయా ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అధికారిక గణాంకాల కంటే ఎబోలా వ్యాప్తి రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. కొత్త కేసుల్లో 80 శాతం కేసులు ఇప్పటికే గుర్తించిన ఇన్ఫెక్షన్ చైన్ వెలుపల నుంచి రావడం, వైరస్ ఆరోగ్య అధికారులు ట్రాక్ చేయగలిగే వేగం కంటే వేగంగా సమాజంలో వ్యాపిస్తోందని సూచిస్తోంది.









