ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ఒప్పో (Oppo), వన్‌ప్లస్ (OnePlus) బ్యాటరీ సామర్థ్యంలో కొత్త రికార్డులు సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. చైనాకు చెందిన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ వీబోలో లీక్ అయిన వివరాల ప్రకారం, ఈ రెండు కంపెనీలు ఏకంగా 10,000mAh లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల భారీ బ్యాటరీలతో స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాయి.
ప్రస్తుతం వన్‌ప్లస్ ఈ 10,000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌పై ప్రాథమిక పరిశోధన దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమాచారం ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు. మరోవైపు ఒప్పో తన ప్రసిద్ధ ‘A’ సిరీస్‌లో భాగంగా 10,000mAh సింగిల్-సెల్ బ్యాటరీతో కూడిన ఫోన్‌ను మొదటగా విడుదల చేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
అలాగే వన్‌ప్లస్ వచ్చే ఏడాది ‘ప్రో’ బ్రాండింగ్‌తో, మోడల్ నంబర్ SM8845తో ఒక కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను 10,000mAh కన్నా పెద్ద బ్యాటరీతో లాంచ్ చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్లు నిజంగా మార్కెట్లోకి వస్తే, రోజులు పాటు ఛార్జింగ్ అవసరం లేకుండా ఉపయోగించుకునే స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని వినియోగదారులకు అందించే అవకాశం ఉంది.








