భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో విజయవంతమైన అత్యవసర చికిత్స
భద్రాచలం, జూలై 15 (వై7 న్యూస్):
భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్యుల అప్రమత్తత, సమయస్ఫూర్తితో ఓ 6 నెలల గర్భిణి ప్రాణాపాయం నుంచి బయటపడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కుంట మండలం మారాయిగూడెం గ్రామానికి చెందిన కురసం హెన్కి (35) అనే గర్భిణి తీవ్ర శ్వాసకోశ సమస్యతో మంగళవారం మధ్యాహ్నం అత్యవసర విభాగానికి తరలించబడింది.
వైద్యుల వివరాల ప్రకారం, ఆమెకు మెడ, ముఖం భాగాల్లో వాపు రావడంతో సమీపంలోని ఓ వైద్య అర్హతలేని వ్యక్తిని ఆశ్రయించారు. అతడు వాపు ఉన్న ప్రాంతాన్ని పళ్లతో కొరకడంతో పరిస్థితి మరింత విషమించి, తీవ్రమైన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రికి చేరుకునే సమయానికి గర్భిణి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో అత్యవసర వైద్య బృందం వెంటనే స్పందించింది. వైద్యులు ఇంట్యూబేషన్ చేసి వెంటిలేటర్‌పై ఉంచి ప్రాణరక్షణ చికిత్స ప్రారంభించారు. అనంతరం ఐసీయూకు తరలించి నిరంతర వైద్య పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.
ఈ క్లిష్ట పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొని గర్భిణి ప్రాణాలను కాపాడడంలో డా. మల్లేష్, డా. జగదీష్, డా. పూజా, డా. తేజస్వినితో పాటు ఐసీయూ సిబ్బంది కీలక పాత్ర పోషించారు. వారి సేవలను ఆస్పత్రి వర్గాలు అభినందించాయి.
ప్రజలకు వైద్యుల సూచన
అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యులను మాత్రమే సంప్రదించాలని వైద్యులు సూచించారు. వైద్య అర్హతలేని వ్యక్తుల వద్ద చికిత్స పొందడం వల్ల ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు అపోహలను నమ్మకుండా ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ఆస్పత్రులను ఆశ్రయించాలని విజ్ఞప్తి చేశారు.








