గిరిజనుల హక్కుల కోసం గళమెత్తిన బీజేపీ నాయకుడు
అశ్వాపురం మండలం, వై7 న్యూస్:
అశ్వాపురం మండలంలోని తుమ్మల చెరువులో చేపల వేటకు వెళ్లిన స్థానిక గిరిజన ప్రజలను కొందరు వ్యక్తులు భయభ్రాంతులకు గురిచేస్తూ, వారి వలలు మరియు పట్టిన చేపలను బలవంతంగా లాక్కుంటున్నారనే సమాచారం అందడంతో బీజేపీ నాయకుడు పొడియం బాలరాజు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
స్థానిక గిరిజనుల వాదనలను విన్న బాలరాజు, వారిని దొంగలుగా చిత్రీకరించడం అన్యాయమని పేర్కొన్నారు. చెరువుపై యాజమాన్యం పేరుతో ఇన్నాళ్లుగా కొందరు వ్యక్తులు ఆధిపత్యం చెలాయిస్తూ గిరిజనుల జీవనోపాధిపై ప్రభావం చూపుతున్నారని ఆరోపించారు.
సంఘటన స్థలంలోనే సంబంధిత వ్యక్తులను ప్రశ్నించిన బాలరాజు, అసలు అక్రమాలు ఎవరు చేస్తున్నారో ప్రజల ముందుంచారని స్థానికులు తెలిపారు. ఆయన జోక్యంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చల్లారగా, యాజమాన్య హక్కులు తమవేనంటూ వాదించిన వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.
తుమ్మల చెరువు సమస్యపై స్పందించిన గ్రామస్తులు, గిరిజనుల హక్కులను కాపాడేందుకు ముందుకొచ్చిన నాయకుడిగా పొడియం బాలరాజును అభినందించారు. ఇన్నాళ్లుగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ, గిరిజనుల సంప్రదాయ హక్కులను హరించే ప్రయత్నాలను సహించబోమని, వారి జీవనోపాధికి భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.
తుమ్మల చెరువులో గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.








