వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కీలక సంకేతాలు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు జనాభాతో సంబంధం లేకుండా 50 శాతం లోక్‌సభ సీట్ల పెంపుపై బిల్లులో స్పష్టమైన హామీ ఇస్తే మద్దతు ఇస్తామని ఆ పార్టీ వెల్లడించింది. ఇది అమల్లోకి వస్తే ఇప్పటివరకు డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తున్న ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు కూడా కొన్ని షరతులతో బిల్లుకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్న వేళ, శరద్ పవార్ వర్గం కూడా సానుకూలంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గం నేతలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో రహస్యంగా సమావేశమైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఊహాగానాలను శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే ధ్రువీకరించలేదు.
సుప్రియా సూలే మాట్లాడుతూ, అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50 శాతం సీట్ల పెంపును ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించి అమలు చేస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఇదే అంశంపై ఏప్రిల్‌లో లోక్‌సభలో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం లోక్‌సభ స్థానాలు పెంచేలా బిల్లును రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. దీంతో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని ఆయన స్పష్టం చేశారు.








