ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మౌలిక సదుపాయాలు, సెమీకండక్టర్లు, మొబైల్ ఫోన్ల తయారీ, ఎరువుల ఉత్పత్తి, రైల్వే విస్తరణ తదితర రంగాలకు సంబంధించిన ఏడు ప్రధాన ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM) 2.0 రెండో దశకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ దశ అమలు కోసం రూ.1.27 లక్షల కోట్ల భారీ నిధులను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో చిప్ తయారీ రంగానికి మరింత ఊతం లభించనుంది.
మొదటి దశలో రూ.76 వేల కోట్ల కేటాయింపుతో ప్రారంభమైన ఇండియా సెమీకండక్టర్ మిషన్‌కు ఈసారి మరింత పెద్ద ఎత్తున నిధులు పెంచడం గమనార్హం. ఈ నిర్ణయం ద్వారా దేశీయ సెమీకండక్టర్ పరిశ్రమను బలోపేతం చేయడంతో పాటు, భారత్‌ను ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో కీలక కేంద్రంగా అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా అధికారులు తెలిపారు.









