E-PAPER

ఆదివాసి జాతి ఆత్మగౌరవానికి ప్రతీక డా. చందా లింగయ్య దొర

డాక్టరేట్‌తో సత్కరించబడిన సందర్భంగా కొనియాడిన ఊకే ముద్దరాజు

మణుగూరు, వై7 న్యూస్:

ఆదివాసుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్, గిరిజన ఉద్యమ నేత డా. చందా లింగయ్య దొర సేవలు చిరస్మరణీయమని సిద్ధి ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఊకే ముద్దరాజు కొనియాడారు.

డా. చందా లింగయ్య దొరకు డాక్టరేట్ ప్రదానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆయన, ఇది కేవలం ఒక వ్యక్తికి దక్కిన గౌరవం మాత్రమే కాదని, ఆదివాసి సమాజం మొత్తం చేసిన పోరాటాలకు లభించిన గుర్తింపుగా భావించాలన్నారు.

సాధారణ గిరిజన కుటుంబంలో జన్మించి ప్రజా ఉద్యమాల ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన చందా లింగయ్య దొర, పదవులను అధికారం కోసం కాకుండా ఆదివాసుల అభ్యున్నతి కోసం వినియోగించిన అరుదైన నాయకుడని పేర్కొన్నారు. ఆదివాసుల సమస్యలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి జీవితాంతం కృషి చేసిన మహోన్నత వ్యక్తిగా ఆయనను అభివర్ణించారు.

1985లో బూర్గంపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన చందా లింగయ్య దొర, గిరిజన ప్రాంతాల సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారని గుర్తు చేశారు. విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, భూ హక్కులు వంటి ప్రాథమిక అంశాలపై ఆయన నిరంతరం పోరాటం చేశారని తెలిపారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా జడ్పీ చైర్మన్‌గా పనిచేసిన సమయంలో గ్రామీణాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారని, మారుమూల గిరిజన గ్రామాలకు ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేశారని పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు మరిన్ని అధికారాలు రావాలని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వేగవంతం కావాలని ఆయన నిరంతరం ప్రభుత్వాలను కోరేవారని చెప్పారు.

రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్, పేసా చట్టం అమలు, గిరిజన భూముల పరిరక్షణ, స్వపరిపాలన హక్కుల కోసం చందా లింగయ్య దొర ఎన్నో వేదికలపై గళం విప్పారని ఊకే ముద్దరాజు అన్నారు. ఆదివాసుల హక్కుల విషయంలో ఎలాంటి రాజీ పడకుండా పోరాడిన నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని చెప్పారు.

మన్యసీమ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా చందా లింగయ్య దొర కీలక పాత్ర పోషించారని, ఆదివాసులకు ప్రత్యేక గుర్తింపు, స్వయం పాలన అవసరమని బలంగా వాదించారని గుర్తు చేశారు. ఆదివాసుల భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి అమోఘమని పేర్కొన్నారు.

ఆదివాసీ సమాజం కోసం చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు లభించిన డాక్టరేట్ గౌరవం పూర్తిగా సముచితమైనదేనని ఊకే ముద్దరాజు అభిప్రాయపడ్డారు. ప్రజల్లో సంపాదించుకున్న విశ్వాసం, నాయకత్వ లక్షణాలు, ఉద్యమ స్ఫూర్తి ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు.

“పదవులు అనేవి వస్తాయి… పోతాయి… కానీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించడం చాలా అరుదు. చందా లింగయ్య దొర అలాంటి నాయకుడు. ఆయన ఆదివాసుల కోసం చేసిన పోరాటం తరతరాలకు స్ఫూర్తి. నేడు ఆయనకు లభించిన డాక్టరేట్ గౌరవం ఆదివాసి జాతి గర్వించదగ్గ సందర్భం” అని ఊకే ముద్దరాజు పేర్కొన్నారు.

ఆదివాసుల ఆత్మగౌరవం, భూ హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన డా. చందా లింగయ్య దొర పేరు గిరిజన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన అన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!