బరువు పెరగడం, వేళ్లు వాపు రావడం లేదా బిగుతైన ఉంగరం ధరించడం వల్ల కొన్నిసార్లు ఉంగరం వేలికి ఇరుక్కుపోతుంది. అలాంటి సమయంలో బలవంతంగా లాగితే చర్మం దెబ్బతినడం, నొప్పి, వాపు మరింత పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలను పాటిస్తే ఉంగరాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా తొలగించవచ్చు.
వేలు వాపుగా ఉంటే ముందుగా చల్లటి నీటిలో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి, అందులో వేళ్లను 5 నుంచి 10 నిమిషాల పాటు ముంచి ఉంచాలి. చల్లదనం వల్ల రక్తనాళాలు సంకోచించి వాపు తగ్గుతుంది. ఆ తర్వాత ఉంగరాన్ని నెమ్మదిగా తిప్పుతూ బయటకు తీసే ప్రయత్నం చేయాలి. అలాగే సబ్బు, కొబ్బరి నూనె, బేబీ ఆయిల్ లేదా పెట్రోలియం జెల్లీ వంటి జారుడుతనం కలిగించే పదార్థాన్ని ఉంగరం చుట్టూ రాస్తే కూడా సులభంగా జారిపోతుంది.
ఈ పద్ధతులతో కూడా ఉంగరం బయటకు రాకపోతే బలవంతంగా లాగేందుకు ప్రయత్నించకండి. వేలు రంగు మారడం, తీవ్రమైన నొప్పి లేదా రక్తప్రసరణ తగ్గినట్లు అనిపిస్తే వెంటనే సమీపంలోని జ్యువెలర్ లేదా ఆసుపత్రికి వెళ్లి నిపుణుల సహాయంతో ఉంగరాన్ని తొలగించుకోవడం మంచిది.









