ఆల్కహాల్ అధికంగా ఉండే కొన్ని నోటి ద్వారా తీసుకునే మందుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ రూల్స్–1945లో సవరణలు చేస్తూ, 12 శాతానికి పైగా ఇథైల్ ఆల్కహాల్ ఉన్న, 30 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో విక్రయించే అన్ని ఓరల్ మెడిసిన్లను షెడ్యూల్–హెచ్1 పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో ఈ మందులను ఇకపై డాక్టర్ ఇచ్చిన చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే విక్రయించాల్సి ఉంటుంది. ఫార్మసీలు ప్రతి విక్రయానికి సంబంధించిన వివరాలను ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసి, ఆ రికార్డులను కనీసం మూడు సంవత్సరాల పాటు భద్రపరచాల్సి ఉంటుంది.
ఈ నిర్ణయం ముఖ్యంగా కొన్ని దగ్గు సిరప్లు, టానిక్లు వంటి అధిక ఆల్కహాల్ శాతం ఉన్న ఔషధాల దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో తీసుకున్నారు. ఈ మందులు నిషేధించినవి కావని, వైద్యుల పర్యవేక్షణలో సూచించిన విధంగా వాడితే సురక్షితమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే వైద్యుల సలహా లేకుండా స్వయంగా కొనుగోలు చేసి వినియోగించడంపై కఠిన నియంత్రణలు అమల్లోకి రానున్నాయి.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మందుల్లోని ఇథైల్ ఆల్కహాల్ ఔషధాల స్థిరత్వం, ప్రభావాన్ని మెరుగుపరచేందుకు ఉపయోగిస్తారు. అయితే అధిక ఆల్కహాల్ ఉన్న మందులను ఇష్టానుసారంగా తీసుకోవడం వల్ల పిల్లలు, వృద్ధులు, కాలేయ సమస్యలు ఉన్నవారు మరియు ఇతర మందులు వాడుతున్నవారిలో దుష్ప్రభావాలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కొత్త నిబంధనలతో మందుల వినియోగంలో పారదర్శకత పెరగడంతో పాటు ప్రజారోగ్య భద్రత మరింత బలోపేతం అవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.








