కెనడా, అమెరికా మధ్య ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గోర్డీ హోవ్ అంతర్జాతీయ వంతెన ప్రజలకు జూలై 27 నుంచి అందుబాటులోకి రానుంది. కెనడా మౌలిక సదుపాయాల శాఖ విడుదల చేసిన ప్రకటనలో, కెనడా, మిషిగన్ రాష్ట్రం పరస్పర అంగీకారంతో అమెరికా ప్రభుత్వ మద్దతుతో ఈ వంతెనను ప్రారంభించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్టు రెండు దేశాల మధ్య వాణిజ్య, రవాణా రంగాలకు కీలకంగా మారనుందని పేర్కొంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వంతెన నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వంతెన నిర్మాణంలో అమెరికాకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని, కనీసం 50 శాతం యాజమాన్యం అమెరికా చేతుల్లో ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. అవసరమైతే ఈ ప్రాజెక్టును పూర్తిగా అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు.
అయితే తాజా ఒప్పందంతో అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. గోర్డీ హోవ్ అంతర్జాతీయ వంతెన ప్రారంభం వల్ల కెనడా-అమెరికా మధ్య వాణిజ్యం మరింత వేగవంతం కావడంతో పాటు, రాబోయే దశాబ్దాల్లో బిలియన్ల డాలర్ల ఆర్థిక కార్యకలాపాలకు ఇది కీలక వేదికగా నిలుస్తుందని కెనడా ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.








