పండగల సీజన్ ప్రారంభానికి ముందే దేశంలో వంట నూనెల ధరలు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం వినియోగించే నూనెల ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ (డీసీఏ) తాజా నివేదిక ప్రకారం, గత ఏడాది కాలంలో ప్రధాన వంట నూనెల ధరలు సగటున 12.8 శాతం మేర పెరిగాయి.
రిటైల్ మార్కెట్లో ఆవనూనె ధర కిలోకు రూ.193.54కు చేరగా, సోయా ఆయిల్ రూ.163.10, పామాయిల్ రూ.147.37గా నమోదైంది. అలాగే బ్రాండెడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ 5 లీటర్ల క్యాన్ ధర ఏకంగా రూ.1,395 వరకు పలుకుతోంది. ఈ ధరల పెరుగుదలతో గృహ వినియోగదారులు నెలవారీ ఖర్చులను సర్దుబాటు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వంట నూనెల ధరల పెరుగుదలకు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, యుద్ధ ప్రభావం, ఎల్‌నినో కారణంగా ఉత్పత్తి తగ్గడం వంటి అంశాలు ప్రధాన కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. పండగల సీజన్‌లో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉండటంతో సమీప భవిష్యత్తులో ధరలు ఇంకా పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.








