E-PAPER

ప్రభుత్వ ఆసుపత్రి రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తే కఠిన చర్యలు: ఎంవీఐ సంగం వెంకట పుల్లయ్య

భద్రాచలం, జూలై 8 (వై7 న్యూస్): ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను మభ్యపెట్టి ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించడం, అధిక అంబులెన్స్ ఛార్జీలు వసూలు చేయడం వంటి చర్యలను ఇకపై సహించబోమని భద్రాచలం మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) సంగం వెంకట పుల్లయ్య హెచ్చరించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ బి. రోహిత్ రాజు, ఐపీఎస్ ఆదేశాల మేరకు, జిల్లా రవాణా శాఖాధికారి వి. వెంకట రమణ సూచనలతో బుధవారం భద్రాచలం పట్టణంలోని జూనియర్ కళాశాల గ్రౌండ్‌లో రవాణా శాఖ, పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రైవేట్ అంబులెన్స్ యజమానులు, డ్రైవర్లతో అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంవీఐ సంగం వెంకట పుల్లయ్య మాట్లాడుతూ, భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను తప్పుదోవ పట్టించి ఇతర ప్రాంతాల ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోగులు, వారి కుటుంబ సభ్యుల పరిస్థితిని ఆసరాగా చేసుకుని అధిక అంబులెన్స్ ఛార్జీలు వసూలు చేయడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు.

నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించినా, అధిక ఛార్జీలు వసూలు చేసినా సంబంధిత వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సమావేశానికి ముందు అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్లు ఫారూక్, రాజశేఖర్ రెడ్డి ప్రైవేట్ అంబులెన్స్‌లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. వాహనాల ఆర్సీ, ఫిట్‌నెస్ సర్టిఫికేట్, పర్మిట్, ఇన్సూరెన్స్, పీయూసీ ధ్రువీకరణ పత్రాలు, డ్రైవర్ల లైసెన్సులు తదితర పత్రాలను పరిశీలించారు.

అనంతరం ఏఎంవీఐలు ఫారూక్, రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్‌ఐ తిరుపతి మాట్లాడుతూ ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు, వారి కుటుంబ సభ్యుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. అంబులెన్స్ సేవలను నైతిక విలువలు, చట్ట నిబంధనలకు అనుగుణంగా అందించాలని డ్రైవర్లు, యజమానులకు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు ప్రవీణ్, నవీన్, హోం గార్డు భీముడు, అంబులెన్స్ యజమానులు జస్వంత్, రామకృష్ణ, దైవియా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News