శ్రీకాకుళం జిల్లా, పలాస, వై7న్యూస్, జూలై 5:
పలాస–కాశీబుగ్గ పట్టణంలోని KT రోడ్డు (పాత జాతీయ రహదారి) ప్రస్తుతం అత్యంత దయనీయ స్థితికి చేరుకుంది. రోడ్డంతా పెద్ద పెద్ద గోతులతో నిండిపోవడంతో వర్షం కురిసిన ప్రతిసారీ వాటిలో నీరు నిలిచి చెరువులను తలపించే పరిస్థితి ఏర్పడుతోంది.
గోతుల్లో నీరు నిల్వ ఉండటంతో వాటి లోతు అంచనా వేయలేక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇక పోస్టాఫీస్ నుంచి మేదరవీధి వరకు రైల్వే వంతెన నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో రహదారి మరింత ఇరుకుగా మారింది. ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు ట్రాఫిక్ సమస్యలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. దీంతో ప్రయాణికులు, స్థానిక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ రహదారిపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి గోతులను పూడ్చి, రోడ్డుకు మరమ్మతులు చేపట్టి వాహనదారులకు సురక్షిత ప్రయాణం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.








