రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ చిత్రం ‘స్పిరిట్’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోందనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతుండగా, ముందస్తు ప్రణాళిక ప్రకారం వరుస షెడ్యూళ్లతో చిత్రబృందం పనులు పూర్తి చేస్తోందని సమాచారం.
సినీ వర్గాల సమాచారం ప్రకారం.. చిత్రీకరణలో ఇప్పటికే సుమారు 70 శాతం పూర్తయిందని, మిగిలిన భాగాన్ని కూడా త్వరగా పూర్తి చేసే లక్ష్యంతో బృందం పనిచేస్తోంది. యాక్షన్ సన్నివేశాల కోసం ప్రభాస్ ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారని, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రీ-ప్రొడక్షన్ నుంచే పక్కా ప్లానింగ్‌తో షూటింగ్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలుస్తోంది.
అయితే, ఈ వివరాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ‘స్పిరిట్’ ప్రభాస్ కెరీర్‌లో బాహుబలి తర్వాత అత్యంత వేగంగా పూర్తవుతున్న చిత్రంగా నిలుస్తుందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, విడుదల తేదీతో పాటు షూటింగ్ పురోగతిపై అధికారిక సమాచారం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.








