ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేసే ఎల్‌నినో పరిస్థితులు మరోసారి బలపడుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో సుమారు 14,500 కిలోమీటర్ల మేర విస్తరించిన భారీ వేడి నీటి అల తూర్పు దిశగా కదులుతున్నట్లు నాసా శాటిలైట్ గుర్తించింది. ఈ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో సముద్ర మట్టం సుమారు 15 సెంటీమీటర్ల వరకు పెరిగినట్లు వెల్లడించింది. ఇదే ఎల్‌నినో ఏర్పడుతున్న ప్రధాన సంకేతమని నిపుణులు చెబుతున్నారు.
అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడినట్లు ప్రకటించింది. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో వీచే వాణిజ్య గాలులు బలహీనపడటంతో పడమరలో పేరుకుపోయిన వేడి నీరు తిరిగి తూర్పు వైపు కదులుతుంది. దీనివల్ల సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగి ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం, ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపే ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడతాయి.
ప్రస్తుతం నమోదవుతున్న పరిణామాలను బట్టి ఈ ఏడాది చివరినాటికి ఎల్‌నినో మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరిగితే 1997, 2015లో నమోదైన తరహా ‘సూపర్ ఎల్‌నినో’ ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు, వ్యవసాయం, వర్షపాతం, ఉష్ణోగ్రతలపై పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.








