శ్రీకాకుళం జిల్లా, పలాస, జూలై 5 (వై7న్యూస్):
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో మద్యం విక్రయాల్లో అనధికార ధరలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులను అరికట్టాలని, అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఉదయం 5 గంటలకే తెరుచుకుంటున్న బారు షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జనసేన పార్టీ నాయకులు ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ, మద్యం దుకాణాలు మరియు బార్లలో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు ప్రజల నుంచి వస్తున్నాయని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ ముందుగానే బార్లు తెరవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు.
ఇలాంటి అక్రమాలను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ యుద్ధ ప్రాతిపదికన స్పందించి, ప్రత్యేక తనిఖీలు నిర్వహించి తక్షణమే నియంత్రణ చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గ జనసేన సమన్వయకర్త డాక్టర్ దుర్గారావుతో పాటు జనసేన నాయకులు, జనసైనికులు హరీష్ కుమార్, శ్రీకాంత్, నందిగాం ధర్మారావు, దేవ, శంకు శ్రీకాంత్, కేదార్, దీన పాత్రో, అనిల్, శివ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.








