భారత్‌లో అమలు చేస్తున్న E20 పెట్రోల్‌పై చర్చ కొనసాగుతున్న వేళ, దీనిని భూటాన్‌కు ఎగుమతి చేసే ప్రతిపాదనకు ఆ దేశం అంగీకరించలేదని సమాచారం. భారత మార్కెట్‌లో సాధారణ పెట్రోల్ అందుబాటులో ఉన్నంత కాలం అదే సరఫరా చేయాలని భూటాన్ కోరినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయానికి వాహనాల కంటే ఎక్కువగా ఆ దేశంలోని ఇంధన నిల్వ వ్యవస్థ, భౌగోళిక పరిస్థితులే కారణమని నివేదికలు పేర్కొంటున్నాయి.
భూటాన్‌లో ఇప్పటికీ అనేక ఇంధన నిల్వ ట్యాంకులు భూగర్భంలో ఉండటంతో పాటు, అధిక తేమ ఉండే పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. E20 పెట్రోల్‌లో ఉండే ఇథనాల్ తేమను సులభంగా గ్రహించే లక్షణం కలిగి ఉండటంతో, దీర్ఘకాల నిల్వ సమయంలో ఇంధన నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో నిల్వ ట్యాంకులు, పైప్‌లైన్లలో తుప్పు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొండ ప్రాంతాల్లో అధిక పనితీరు అవసరమయ్యే వాహనాలకు సాధారణ పెట్రోల్‌కే ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, భారత్‌లో కూడా E20 పెట్రోల్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా 2023కు ముందు తయారైన కొన్ని వాహనాల యజమానులు మైలేజ్ తగ్గడం, నిర్వహణ ఖర్చులు పెరగడం వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఇథనాల్ మిశ్రమ ఇంధనం దిగుమతి చమురుపై ఆధారాన్ని తగ్గించడంలో, కాలుష్య నియంత్రణలో దోహదపడుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే E20 వినియోగం ప్రతి వాహనానికి అనుకూలంగా ఉండాలంటే తయారీదారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.








