E-PAPER

పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్.. శనివారం నుంచి బోటు సేవలు పునఃప్రారంభం

 

దాదాపు 20 రోజుల విరామం తర్వాత పాపికొండల విహారయాత్రకు అధికారులు మళ్లీ అనుమతి ఇచ్చారు. శనివారం నుంచి పర్యాటక బోటు సేవలు పునఃప్రారంభం కానుండగా, పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని గండిపోశమ్మ ఆలయం నుంచి ఒక ఏపీటిడీసీ బోటుతో పాటు 15 ప్రైవేట్ పర్యాటక బోట్లు సేవలకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో పాపికొండల అందాలను ఆస్వాదించేందుకు వచ్చే పర్యాటకులకు ఊరట లభించింది.

గత నెల జూన్ 14న పోశమ్మగండి నుంచి బయలుదేరిన ఓ పర్యాటక బోటు దేవీపట్నం పోలీస్ స్టేషన్ సమీపంలో సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. బోటు అడుగుభాగంలోని ఇంపెల్లర్‌కు చేపల వల చిక్కుకోవడంతో ఈ సమస్య తలెత్తగా, ప్రయాణికులు కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారు. అనంతరం సమస్యను పరిష్కరించి బోటును సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అధికారులు భద్రతా చర్యల్లో భాగంగా విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.

అనంతరం అన్ని పర్యాటక బోట్లను సమగ్రంగా తనిఖీ చేసి భద్రతా ప్రమాణాలను పరిశీలించిన అధికారులు తాజాగా మళ్లీ అనుమతులు జారీ చేశారు. ఏపీ పర్యాటక శాఖ బోటుతో పాటు 15 ప్రైవేట్ బోట్లు సేవలు అందించనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు వస్తుండటంతో, సేవల పునఃప్రారంభం పర్యాటక రంగానికి ఊతమివ్వనుంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News