E-PAPER

దేశంలో తొలిసారిగా విమానం వేలం వేసిన ఈడీ.. రూ.3 కోట్లకు హాకర్ 800ఏ జెట్ విక్రయం

 

దేశంలో తొలిసారిగా అక్రమ ఆస్తుల స్వాధీనం ప్రక్రియలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఒక ప్రైవేట్ విమానాన్ని వేలం వేసింది. ఫాల్కన్ గ్రూప్‌కు సంబంధించిన భారీ పోంజీ స్కీం కేసులో స్వాధీనం చేసుకున్న హాకర్ 800ఏ (Hawker 800A) ప్రైవేట్ జెట్‌ను రూ.3 కోట్లకు విక్రయించింది. జూలై 1న హైదరాబాద్ జోనల్ కార్యాలయం ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీసీ లిమిటెడ్ ద్వారా ఈ వేలం నిర్వహించారు.

ఈ విమానాన్ని 2025 మార్చి 7న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్వాధీనం చేసుకున్నారు. క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, దాని సీఎండీ అమర్‌దీప్ కుమార్ తదితరులపై నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈ విమానం కీలక ఆస్తిగా గుర్తించిన ఈడీ, పీఎంఎల్ఏ న్యాయ అధికారుల అనుమతితో వేలం నిర్వహించింది. దర్యాప్తు ప్రకారం ఫాల్కన్ గ్రూప్ నకిలీ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ వ్యాపారం పేరుతో పెట్టుబడిదారులను మోసం చేసి సుమారు రూ.792 కోట్లను అక్రమంగా సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

విమానం విక్రయం ద్వారా వచ్చిన రూ.3 కోట్లను ప్రత్యేక కోర్టు అనుమతితో పీఎంఎల్ఏ నిబంధనల ప్రకారం బాధిత పెట్టుబడిదారులకు పరిహారంగా చెల్లించనున్నట్లు ఈడీ తెలిపింది. ఈ కేసులో అమర్‌దీప్ కుమార్ సోదరుడు సందీప్ కుమార్, చార్టర్డ్ అకౌంటెంట్ శరద్ చంద్ర తోష్నివాల్, ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ సీఈవో ఆర్యన్ సింగ్ ఛబ్రాలను కూడా ఈడీ అరెస్టు చేసింది. కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News