అశ్వాపురం, జూలై 3: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలోని గౌతమి నగర్ తరంగిణి ఫంక్షన్ హాల్లో ఈ నెల 5వ తేదీన నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఎస్‌ఏఎస్‌ఎస్‌ఏ అధ్యక్షుడు గడ్డం రమేష్, ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు తెలిపారు.
శుక్రవారం గౌతమి నగర్ కాలనీలోని గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఫెడరేషన్ కాన్ఫరెన్స్‌ను ఈసారి అశ్వాపురంలోని తరంగిణి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో రాబోయే మూడేళ్ల కాలానికి నూతన కమిటీ ఏర్పాటుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
అటామిక్ ఎనర్జీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై విస్తృతంగా చర్చించి, వాటి పరిష్కారానికి అవసరమైన తీర్మానాలను ఆమోదించి యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. దేశంలోని వివిధ యూనిట్లకు చెందిన ప్రతినిధులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరుకానున్నారని వెల్లడించారు.
విలేకరుల సమావేశంలో ఎస్‌ఏఎస్‌ఎస్‌ఏ జనరల్ సెక్రటరీ కెవివి రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోహన్ బాబు, ఎంప్లాయీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రాయల రాజేష్, ఆఫీస్ సెక్రటరీ ఎస్కే హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.








